జగ్గయ్యపేట/వేదాద్రి (యువ గళం న్యూస్):
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, పవిత్ర కృష్ణా నదీ తీరాన వెలసిన పంచ నరసింహ క్షేత్రమైన వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు బుధవారం నాటితో వైభవంగా ముగిశాయి. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం 7 గంటల నుంచి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు. ఈ వేడుకలో దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరా దత్తు ప్రతినిధిగా రాంప్రసాద్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ధర్మకర్తల సౌజన్యంతో అలంకరణలు:
ఈ పవిత్రోత్సవాలకు దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరా దత్తు సౌజన్యంతో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, శోభాయమానమైన పూలదండలు, నివేదనకు ప్రసాదాలు, మండప అలంకరణతో పాటు పూజా సామగ్రిని సమర్పించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) కానూరి సురేష్ బాబు తెలిపారు. కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాద వితరణ చేపట్టారు.