కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
కోదాడ రూరల్ యువ గళం న్యూస్ :
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో శుక్రవారం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిందిలా..
స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థులు కోదాడలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో కోదాడ సమీపంలోని ద్వారకుంట వద్దకు చేరుకోగానే, ఎదురుగా వచ్చిన ఒక కారు వేగంగా ఆటోను ఢీకొట్టింది.
ఒకరు స్పాట్ లోనే మృతి
ఈ ఘోర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మూడవత్ రామకోటేశ్వరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద దాటికి ఆటో పూర్తిగా దెబ్బతింది.
ముగ్గురి పరిస్థితి విషమం.. విజయవాడకు తరలింపు
ఆటోలో ఉన్న మిగిలిన ప్రయాణికులు మూడవత్ నరసింహ, కాలేశ్వరావు, అజ్మీర యలమంద తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని వెంటనే విజయవాడ తరలించారు.
గమనిక: ప్రమాదానికి గల పూర్తి కారణాలు, కారు డ్రైవర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.