తెలంగాణలో ఏపీ పోలీస్ అధికారి అభిమన్యు నాయక్‌కు ఘన సన్మానం
హైదరాబాద్, జూన్ 07 యువ గళం న్యూస్ :
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 44వ వార్షికోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) అభిమన్యు నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆయనను, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ వేదికపై ఘనంగా సత్కరించారు.
బ్యాంకింగ్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవలోకి..
ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసిన అభిమన్యు నాయక్, తొలుత బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించారు. అయితే, ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పంతో ఆ ఉద్యోగాన్ని వదులుకుని పోలీస్ శాఖలో చేరారు. గత పదేళ్లుగా విధి నిర్వహణతో పాటు సమాంతరంగా వందలాది సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు మరియు ఆపదలో ఉన్న అనేక కుటుంబాలకు ఆయన అండగా నిలిచారు.
ఆయన సమాజానికి ఆస్తి: మంత్రి వివేక్
ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పోలీస్ విధులతో పాటు సామాజిక సేవను జీవిత ధ్యేయంగా మార్చుకున్న అభిమన్యు నాయక్ సేవలను కొనియాడారు. ఇలాంటి అధికారులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తారని, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే అధికారులు సమాజానికి ఆస్తి లాంటివారని ప్రశంసించారు.
సేవకు సరిహద్దులు లేవు..
సొంత రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించకపోయినప్పటికీ, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో, రాష్ట్ర స్థాయి వేదికపై ఈ సత్కారం దక్కడం అభిమన్యు గారి నిరంతర సేవలకు లభించిన అరుదైన గౌరవమని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
సన్మాన గ్రహీత అభిమన్యు నాయక్ మాట్లాడుతూ.. "ఈ గౌరవం సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి పోలీస్ అధికారికి, సామాజిక సేవకుడికి దక్కుతుంది" అని పేర్కొంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.