జగ్గయ్యపేట, జూన్ 7 యువ గళం న్యూస్ :
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గయ్యపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జూన్ 7 నుండి 21వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన ఈ ప్రత్యేక యోగ ఉత్సవాల్లో జగ్గయ్యపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యోగ గురువుల సూచనల మేరకు అధికారులతో కలిసి స్వయంగా వివిధ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నొక్కి చెప్పారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో దీనిని ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేస్తూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) పి. వెంకటేశ్వరరావు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) రాజు, పోలీస్ మరియు మున్సిపల్ సిబ్బందితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు కలిపి సుమారు 300 మంది పాల్గొన్నారు. సూర్య ఫౌండేషన్‌కు చెందిన ప్రముఖ యోగ గురువు డాక్టర్ కరణం యుగేందర్ పిల్లి, గాయత్రి సంఘానికి చెందిన లీలావతి బృందం హాజరై అందరితో యోగాసనాలు చేయించారు.