అనుమంచిపల్లి వద్ద ఘోర ప్రమాదం..... క్షతగాత్రుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కౌన్సిలర్ వట్టెం మనోహర్.....

జగ్గయ్యపేట గ్రామీణ యువ గళం న్యూస్: జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామ సమీప జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో జగ్గయ్యపేట వైకాపా మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ అద్భుత సమయస్ఫూర్తిని చాటి ఒకరి ప్రాణాన్ని కాపాడారు. రహదారి పక్కన సందీప్ అనే డ్రైవర్ తన ఆటోను నిలిపి ఉంచగా, నల్గొండ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓమ్ని వ్యాన్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు పక్కనే ఉన్న చెట్లను ఢీకొని ఆగిపోగా, ఆటో డ్రైవర్ సందీప్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అదే సమయంలో నల్గొండ నుంచి వస్తున్న కౌన్సిలర్ వట్టెం మనోహర్ ప్రమాదాన్ని గమనించి వెంటనే ఆగారు. క్షతగాత్రుడిని ఆటోలో నుంచి బయటకు తీసి, రోడ్డు పక్కన పడుకోబెట్టి తక్షణమే సీపీఆర్ (CPR) చేయడంతో సందీప్ స్పృహలోకి వచ్చాడు. అనంతరం స్థానికుల సహాయంతో అతడిని తన సొంత వాహనంలో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కౌన్సిలర్, బాధితుడికి అత్యవసర వైద్యం అందేలా చూసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు నిలిపిన కౌన్సిలర్ మనోహర్ మానవత్వాన్ని స్థానికులు ఎంతగానో అభినందిస్తున్నారు.