రసాయనిక ఎరువులు తగ్గించి.. నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

వత్సవాయి మండలం, జూన్ 9 యువ గళం న్యూస్: వత్సవాయి మండలంలోని మక్కపేట, లింగాల గ్రామాలలో గరికపాడు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ (పొలాలను కాపాడుకుందాం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. పంట పొలాల్లో రసాయనిక ఎరువులను విరివిగా వాడటం తగ్గించాలని సూచించారు. వాటికి ప్రత్యామ్నాయంగా పశువుల ఎరువు లేదా పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగించి నేల ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను కాపాడుకోవాలని కోరారు.
​పంటలను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు రసాయనాలపైనే ఆధారపడకుండా.. జిగురు అట్టలు, ట్రైకోడెర్మా విరిడి, వేప నూనె వంటి పర్యావరణ హిత పద్ధతులను పాటించాలని శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. అధికంగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల సారం దెబ్బతినడమే కాకుండా, మనుషుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. జీవన ఎరువుల వాడకం పెంచడం ద్వారా అటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని, ఇటు అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. పంట వేయడానికి ముందే పీఎండీఎస్ (PMDS) కిట్‌ను ఉపయోగించాలని, దీనివల్ల నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెంది పంట ఆరోగ్యంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
​ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. రాజశేఖర్, డాక్టర్ పి. జస్వంత్ రెడ్డి, ఎన్‌సీఐపీఎం (NCIPM) నుంచి డాక్టర్ వీరయ్య చౌదరి, డీఆర్‌సీ (DRC) నుంచి వ్యవసాయ అధికారి పద్మజారాణి, గ్రామ వ్యవసాయ సహాయకులు (VAA) పద్మ, చక్రవర్తి మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.